Narendra Modi: ఓటమి ఎఫెక్ట్: ఓటర్ల మూడ్ ఎలా ఉందో తెలుసుకుని చెప్పండి.. నిఘావర్గాలకు మోదీ సర్కారు ఆదేశం
- ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి పరాభవం
- కేంద్ర నిఘావర్గాలతో సమావేశం
- ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ అప్రమత్తమైంది. ప్రతిష్ఠాత్మకంగా భావించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో అధికారం కోల్పోయింది. దీంతో అప్రమత్తమైన మోదీ సర్కారు లోపాలు వెతికే పనిలో పడింది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని యోచిస్తోంది.
ఇందులో భాగంగా ఓటర్ల ఆలోచనా విధానం ఎలా ఉందో తెలుసుకోవాలంటూ నిఘా వర్గాలను ఆదేశించింది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణమయ్యే అంశాలను గుర్తించి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాల్సిందిగా సూచించింది. ప్రజల అసంతృప్తిని గుర్తించడంలో పొరపాటు ఎక్కడ జరిగిందో విశ్లేషించాల్సిందిగా కోరింది. బుధవారం కేంద్ర నిఘావర్గాలతో అత్యవసరంగా నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.