KCR: చకచకా ఏర్పాట్లు... రాజ్ భవన్ లో సందడి మొదలు!

  • నేటి మధ్యాహ్నం కేసీఆర్ ప్రమాణం
  • ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించిన పోలీసులు
  • పార్కింగ్ ఏర్పాట్లు పూర్తి

నేడు తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేయనుండగా, రాజ్ భవన్ ఈ వేడుకకు ముస్తాబవుతోంది. ఇప్పటికే కార్యక్రమానికి ఏర్పాట్లు చేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. మధ్యాహ్నం 1.25కు తన ప్రమాణ స్వీకారానికి ముహూర్తంగా కేసీఆర్ నిర్ణయించుకున్నారు.

రాష్ట్రంలోని పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు దీనికి హాజరు కానుండగా, భద్రత కోసం ఖైరతాబాద్ జంక్షన్ నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం వరకూ ఆంక్షలను విధించారు. ఈ మార్గంలో ఉదయం 10.30 గంటల నుంచి సాధారణ రాకపోకలను నిలిపివేస్తామని, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఈ మార్గం తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమానికి వచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలను గేట్ నం.3 నుంచి అనుమతిస్తామని, వారి వాహనాలకు అక్కడే పార్కింగ్ ఏర్పాట్లు చేశామని అన్నారు. మీడియా వాహనాలను దిల్ ఖుష్ గెస్ట్ హౌస్ ఆవరణలో, ప్రభుత్వ అధికారుల వాహనాలను నక్లెస్ రోడ్ ఎంఎంటీఎస్ స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేశామని అన్నారు. రోడ్డుపై సింగిల్ లైన్ పార్కింగ్ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News