Rain: ముంచుకొస్తున్న 'ఫెథాయ్' తుపాన్!
- ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం
- రేపటికి పెను తుపానుగా మారే అవకాశం
- 16 లేదా 17న తీరం దాటే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండానికి వాతావరణ శాఖ అధికారులు 'ఫెథాయ్' అని నామకరణం చేశారు. ఇది మరింతగా బలపడి పెను తుపానుగా మారనుందని అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ప్రస్తుతం తుపాను చెన్నైకి దక్షిణ ఆగ్నేయ దిశగా 1,040 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,210 కిలోమీటర్ల దూరంలో ఉంది. రేపటికి ఇది పెను తుపానుగా మారుతుందని అధికారులు వెల్లడించారు. కోస్తా తీరం వెంబడి ప్రస్తుతం 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తుండగా, వీటి వేగం 100 కి.మీ. వరకూ పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
మధ్య కోస్తా ప్రాంతంలో 16వ తేదీ రాత్రి లేదా 17 ఉదయం ఇది తీరాన్ని దాటవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ కాగా, మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.