polavaram: పోలవరం, పట్టిసీమ పేరెత్తడానికే జగన్ భయపడుతున్నారు : మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
- దురుద్దేశంతోనే ముంపు మండలాలపై లేనిపోని పంచాయతీలు
- ప్రజల మేలు కోరే వారైతే కేసులు అడ్డుకోవాలి
- అభివృద్ధి చూసి మాట్లాడాలని హితవు
పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల పేరెత్తడానికే విపక్ష నాయకుడు జగన్ భయపడుతున్నారని, అవి పూర్తయితే తన కొంపకొల్లేరవుతుందని బెంగపడుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఈ కారణంగానే ముంపు మండలాలపై లేనిపోని పంచాయతీలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. నిజంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టును అడ్డుకునేందుకు వేస్తున్న కేసులను అడ్డుకోవాలని, కానీ ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నదుల అనుసంధానం, పులివెందులకు కృష్ణానీటి ప్రవాహం విషయం జగన్కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
పొరుగున ఉన్న తెలంగాణలో కూర్చుని ఏపీపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తన ఎంపీలను బీజేపీకి అప్పగించి లాలూచీ పడ్డారని విమర్శించారు. కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ కారణంగా పంటలకు ఎటువంటి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని, రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.