kcr: మైహోమ్ రామేశ్వరరావుతో ఉత్తమ్ ఒప్పందం చేసుకున్నారు: గజ్జెల కాంతం
- కేసీఆర్ చెప్పినట్టు ఉత్తమ్ విన్నారు
- టీ- కాంగ్రెస్ ను ఉత్తమ్ సర్వనాశనం చేశారు
- ఉత్తమ్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి
మైహోమ్ రామేశ్వరరావుతో ఉత్తమ్ ఒప్పందం చేసుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ సీట్లను ఆలస్యంగా ప్రకటించిందని టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ చెప్పినట్టు విన్నారని, తన కుంభకోణాలు బయటపెట్టొద్దంటూ ఉత్తమ్ సరెండర్ అయ్యారని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా ఓడినా నైతిక బాధ్యత వహిస్తానన్న ఉత్తమ్, పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ ముందుకు తీసుకెళ్తుంటే తెలంగాణలో మాత్రం ఆ పార్టీని ఉత్తమ్ సర్వనాశనం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నాడు పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 సీట్లు గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు. బీసీలు టీ-పీసీసీ అధ్యక్షుడిగా పనికిరారంటూ నాడు పొన్నాలను ఆ పదవి నుంచి దింపించారని అన్నారు. ఉత్తమ్ హయాంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లే వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.