Venkaiah Naidu: కొన్ని పత్రికల్లో హెడ్డింగ్స్ చూస్తుంటే వీళ్లకు ‘హెడ్ ఉందా?’ అనే అనుమానం కలుగుతోంది: వెంకయ్యనాయుడు
- హెడ్ లైన్ జనాలకు డెడ్ లైన్ కాదు
- చాలా పత్రికల తీరు ఇదేవిధంగా ఉంది
- సంచలనానికి కాకుండా సత్యానికి దగ్గరగా ఉండాలి
ఏదైనా చదవాలనే ఆసక్తి కలగాలి తప్ప, విరక్తి కలగకూడదని, కొన్ని పత్రికల్లో హెడ్డింగ్స్ చూస్తుంటే వీళ్లకు హెడ్ ఉందా అని మనకు అనుమానం కలుగుతుందని, ప్రత్యేకంగా ఒక పత్రిక అని కాదు, చాలా పత్రికల తీరు ఇదేవిధంగా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీ ఆర్ గ్రౌండ్స్ లో నేషనల్ బుక్ ఫెయిర్ ను ఈరోజు ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ‘మీరు పెట్టే హెడ్ లైన్ జనాలకు డెడ్ లైన్ కాదు. అసలు లైన్ ఉందా? లేదా? అని ఆలోచించుకోవాలి. పస లేకుండా వస ఉంటే లాభం లేదు. కేవలం నసగానే మిగిలిపోతుంది. పత్రికలు కూడా ప్రజల్లో చైతన్యాన్ని, సామాజిక స్పృహను తీసుకురావాలి. ఆసక్తి, అనురక్తిని పెంచాలి. చక్కని పదాలను ప్రాచుర్యంలోకి తేవాలి. పుస్తకాలకు, సినిమాకు, పత్రికలకు ఈ శక్తి ఉంది. పుస్తకాల ప్రస్తావన సినిమాల్లో కూడా ఉండాలి.
ఇప్పటికీ కొన్ని పత్రికలు గ్రంథ సమీక్ష చేస్తుండటం చాలా సంతోషం. ప్రత్యేకించి కొన్ని పత్రికలు సాహిత్యానికి ప్రాధాన్యమిచ్చి, గ్రంథ సమీక్ష చేస్తుంటాయి. కొంతమందేమో అది కూడా వేస్ట్ అని, ఆ పేజీని కమర్షియల్ గా చేసుకోవచ్చని ఆలోచిస్తున్నారు. అది మంచిది కాదు.. సంచలనానికి దగ్గరగా కాకుండా సత్యానికి దగ్గరగా పత్రికలు ఉండాలి’ అని వెంకయ్యనాయుడు సూచించారు.