Congress: కేసీఆర్ సమీక్షలో కనిపించని హరీశ్ రావు... టీఆర్ఎస్ లో కొత్త చర్చ!
- నిన్న నీటి పారుదల శాఖపై కేసీఆర్ సమీక్ష
- హరీశ్ గైర్హాజరుతో కొత్త అనుమానాలు
- శాఖ మారవచ్చంటున్న టీఆర్ఎస్ నేతలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, తొలి మంత్రివర్గంలో నీటి పారుదల శాఖను నిర్వహించి, పలు ప్రాజెక్టు నిర్మాణాలను పరుగులు పెట్టించిన హరీశ్ రావు, నిన్నటి కేసీఆర్ సమీక్షకు హాజరుకాకపోవడం, టీఆర్ఎస్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. తెలంగాణలోని ప్రాజెక్టులపై సమీక్ష జరిపిన కేసీఆర్, రెండేళ్లలో ప్రాజెక్టులు పూర్తి కావాలని ఆదేశిస్తూ, పనుల్లో జాప్యం చేస్తున్న అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు పనులనూ ఆయన సమీక్షించారు. ఇటువంటి కీలక సమయంలో హరీశ్ గైర్హాజరుతో, మరోసారి ఆయనకు సాగునీటి శాఖ దక్కుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో నీటి పారుదల శాఖతో సంబంధం లేని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిలు హాజరు కావడం, ప్రభుత్వ అధికారుల మధ్య కొత్త చర్చకు కారణమైంది. గతంలో సాగునీటి శాఖపై జరిపిన దాదాపు అన్ని సమీక్షల్లో హరీశ్ పాల్గొన్నారు. తాజా పరిణామాలతో హరీశ్ కు మంత్రి పదవి ఖాయమే అయినా, సాగునీటి శాఖ దక్కకపోవచ్చని కొందరు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.