LOTTERY: బ్యాంకు సొమ్ముతో లాటరీ టిక్కెట్లు.. బ్యాంకు మేనేజర్ అరెస్ట్
- పశ్చిమబెంగాల్ ఈస్ట్బుర్ధ్వాన్ లో ఘటన
- లాటరీలకు అలవాటు పడ్డ తారక్
- పోలీసులు ముందు నేరాంగీకారం
కంచె చేను మేయడం అంటే ఇదే. లాటరీకి అలవాటు పడ్డ బ్యాంకు మేనేజర్ ఆఫీసులో ఉన్న సొమ్ముపై కన్నేశాడు. నోట్ల కట్టలు తీస్తే అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో చిల్లరను తీసుకెళ్లడం మొదలుపెట్టారు. ఇలా భారీగా నగదును లాటరీ టికెట్లు కొనడానికి వెచ్చించాడు. చివరికి ఆడిట్ లో భారీ తేడా రావడంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకుంది.
ఈస్ట్బుర్ధ్వాన్ జిల్లా, మేమారీ ఎస్బీఐ శాఖలో తారక్ జైశ్వాల్ (35) సీనియర్ అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో లాటరీ టికెట్లు కొనడానికి అలవాటుపడ్డ తారక్ తన జీతం మొత్తాన్ని దానికే తగలేశాడు. చివరికి అతని చూపు బ్యాంకు సొమ్ముపై పడింది. అయితే నోట్ల కట్టలు తీస్తే దొరికిపోతానని భావించిన తారక్.. చిల్లరపై కన్నేశాడు. ముఖ్యంగా రూ.10 కాయిన్లను బ్యాంకు నుంచి గుట్టుగా తీసుకెళ్లేవాడు. ఇలా ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా రూ.84 లక్షలు లాటరీ టికెట్లు కొని పొగొట్టుకున్నాడు.
అయితే ఇటీవల ఆడిట్ జరిగిన సమయంలో నగదులో భారీగా తేడా రావడాన్ని అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా విచారణ ప్రారంభించగానే, తారక్ సెలవుపై వెళ్లిపోయాడు. దీంతో అతనిపై పోలీసులకు బ్యాంకు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. చివరికి ఈస్ట్బుర్ధ్వాన్ పోలీసులు తారక్ ను అదుపులోకి తీసుకుని తమ స్టెయిల్ లో విచారించడంతో తానే ఈ నేరానికి పాల్పడ్డానని నిందితుడు అంగీకరించాడు. దీంతో తారక్ ను కోర్టు ముందు హాజరుపరిచిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.