TRS: టీఆర్ఎస్ గెలిచింది ఈవీఎంల ట్యాంపరింగ్ తోనే.. ప్రజాబలంతో కాదు: కాంగ్రెస్ నేత దామోదర్ రెడ్డి
- ప్రతి నియోజకవర్గంలో 30 వేల వరకు ఓట్ల ట్యాంపరింగ్ జరిగింది
- మహాకూటమి గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయి
- ఈ ఓటమితో అధైర్యపడేది లేదు
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈవీఎంలను ట్యాపరింగ్ చేేసి టీఆర్ఎస్ గెలుపొందిందని... ప్రజాబలంతో గెలుపొందలేదని ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, ప్రజాకూటమి గెలుపు ఖాయమనే విషయం అన్ని సర్వేలలో తేలిందని... అయినా, టీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయని కేసీఆర్ ఎలా చెప్పగలిగారని ఆయన ప్రశ్నించారు. ప్రజాకూటమి ఓటమి పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 30 వేల వరకు ఓట్ల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించారు.
తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశానని... ఈ ఓటమితో అధైర్యపడేది లేదని దామోదర్ రెడ్డి అన్నారు. రాబోయే పంచాయతీ, మున్సిపాలిటీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాము అసెంబ్లీకి వెళ్లలేనప్పటికీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకెళతామని తెలిపారు.