Andhra Pradesh: ‘ప్రత్యేకహోదా’ పోరాటంపై జగన్ కీలక నిర్ణయం.. ఇకపై పోరాటం ఢిల్లీలోనే!
- మీడియాకు వివరాలు వెల్లడించిన బొత్స
- హోదా కోసం వైసీపీ పోరాడుతోందని వెల్లడి
- జనవరి 10న పాదయాత్ర ముగింపు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాలని 2014 నుంచి వైసీపీ పోరాడుతోందని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. కేంద్రం, టీడీపీ రెండూ ప్రత్యేకహోదా విషయంలో మాట తప్పాయని విమర్శించారు. హోదా ఏమన్నా సంజీవనా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎకసెక్కాలాడారని అన్నారు. ఈ నెల 27న దేశరాజధాని ఢిల్లీలో ‘వంచనపై గర్జన’ దీక్షను నిర్వహిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బొత్స మాట్లాడారు.
జగన్ ప్రజాసంకల్ప యాత్ర 2019, జనవరి 9-10 తేదీల్లో ఇచ్ఛాపురంలో ముగుస్తుందని బొత్స తెలిపారు. ఈ నేపథ్యంలో జగన్ కు సంఘీభావంగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు జనవరి 5,6,7 తేదీల్లో పాదయాత్ర చేస్తాయని వెల్లడించారు. ఢిల్లీలో జరిగే వంచనపై గర్జన సభలో జగన్ పాల్గొంటారన్నారు. అవినీతిలో మునిగితేలుతూ, ప్రత్యేకహోదాకు మంగళం పాడిన చంద్రబాబుకు ఏపీ ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.