no phone for year: ఒక్క సంవత్సరం ఫోన్ వాడకుంటే.. రూ.72 లక్షలు ఇస్తాం!: అమెరికా కంపెనీ బంపర్ ఆఫర్
- పోటీని ప్రకటించిన విటమిన్ వాటర్ సంస్థ
- కంప్యూటర్, ల్యాప్ టాప్ వాడుకోవచ్చని వెల్లడి
- జనవరి 8 నుంచి దరఖాస్తుల ఆహ్వానం
మీరు స్మార్ట్ ఫోన్ వాడకుండా ఎంతసేపు ఉండగలరు? గంట లేదా రెండు గంటలు.. అంతసేపు స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉంటేనే ప్రపంచం తలకిందులు అయినట్లు ఉంటుంది. అయితే ఓ ఏడాది పాటు స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉంటే దాదాపు రూ.72 లక్షలు అందిస్తామని ఓ అమెరికా కంపెనీ చెబుతోంది. ఇందుకోసం ఫోన్ ను 365 రోజులు వాడకూడదని షరతు విధిస్తోంది.
కోకాకోలా కంపెనీ అనుబంధ సంస్థ విటమిన్ వాటర్ ‘no phone for a year’ పేరిట ఈ పోటీని నిర్వహిస్తోంది. ఇందులో పోటీ పడేందుకు విటమిన్ వాటర్‌కు చెందిన ట్విటర్, లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా జనవరి 8, 2019 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోటీలో పాల్గొనేవారు స్మార్ట్‌ఫోన్ లేకుండా సమయాన్ని ఎలా గడుపుతాం? అనే విషయాన్ని సదరు పోటీదారుడు కంపెనీకి వివరించాల్సి ఉంటుంది.
పోటీదారుడు ఇచ్చే సమాధానం నచ్చితే కాంట్రాక్ట్ పత్రాలపై సంతకం చేయించుకుంటారు. ల్యాప్‌టాప్, కంప్యూటర్లను ఈ పోటీలో భాగంగా వాడుకునే వెసులుబాటు ఉంది. అయితే పోటీలో పాల్గొని చివరిదాకా కొనసాగలేని వారి కోసం విటమిన్ వాటర్ సంస్థ మరో ఆఫర్ ప్రకటించింది. కనీసం 6 నెలల పాటు ఫోన్ వాడకపోయినా రూ.7 లక్షలను ఖాతాలో జమ చేస్తామని చెబుతోంది. అన్నట్లు ఇంట్లో వాళ్లు, స్నేహితులతో మాట్లాడేందుకు1996 నాటి సెల్యూలర్ ఫోన్ ను కంపెనీ అందిస్తుంది.