Pethai cyclone: ‘పెథాయ్’ కారణంగా తెలంగాణలో ఓ మోస్తరు వర్షం.. తీరం దాటే సమయంలో గాలులు
- శ్రీకాకుళం, కాకినాడ వైపు కదలిక
- తుపాను ప్రభావం రాయలసీమపై తక్కువ
- ఎప్పటికప్పుడు వివరాల ప్రకటన
పెథాయ్ తుపాను ప్రభావం తెలంగాణపై చూపనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ శాఖ డైరెక్టర్ వైకే రెడ్డి మాట్లాడుతూ తుపాను కారణంగా తెలంగాణలో ఈ నెల 18న ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే తుపాను ఈశాన్య దిశగా శ్రీకాకుళం, కాకినాడవైపు కదులుతోందన్నారు.
దీని కారణంగా గుంటూరు, ఉభయగోదావరి, విశాఖ జిల్లాలకు ముప్పు పొంచి ఉందన్నారు. అయితే దీని ప్రభావం రాయలసీమపై పడే అవకాశం తక్కువన్నారు. తుపాను తీరం దాటే సమయంలో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండవచ్చని వెల్లడించారు. తుపాను కదలికలను గుర్తించి, ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తామని వైకే రెడ్డి తెలిపారు.