Andhra Pradesh: కోస్తాలో మారిన వాతావరణం.. 50 అడుగుల మేర ముందుకొచ్చిన సముద్రం!

  • పలు జిల్లాల్లో పాఠశాలల మూసివేత
  • ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
  • 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు

పెథాయ్ తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో సముద్రం ముందుకొచ్చింది. నెల్లూరు జిల్లాలోని తుమ్మలపెంట, కృష్ణా జిల్లాలోని హంసలదీవి, విజయనగరంలోని భోగాపురం, కాకినాడలోని ఉప్పాడలలో సముద్రం 50 అడుగుల మేర ముందుకొచ్చింది.

 ఈదురు గాలుల ధాటికి దివిసీమలో పదివేల ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లాలో 17 మండలాలపై తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 283 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆర్డీవో, తహసీల్దార్లకు అత్యవసర నిధులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. నిత్యావసర వస్తువులను మండల కేంద్రాలకు తరలించింది. సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలో 20, ప్రకాశం జిల్లాలో 14, పశ్చిమగోదావరి జిల్లాలో 6, విజయనగరం జిల్లాలో 2 మండలాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాల వ్యాప్తంగా పాఠశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

పశ్చిమ గోదావరిలోని ఆచంట, పెనుమంట్ర మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను ప్రభావంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో తీరం వెంబడి 70-80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తీర ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

  • Loading...

More Telugu News