Pethai: బలహీనపడుతోంది... పెథాయ్ లేటెస్ట్ అప్ డేట్!
- సాయంత్రానికి బలహీనపడే అవకాశం
- కాకినాడ దగ్గర తీరం దాటనున్న పెథాయ్
- 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు
కోస్తాంధ్రను చిగురుటాకులా వణికిస్తున్న పెథాయ్ తుపాను ప్రస్తుతం కాకినాడకు 270 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కదులుతోంది. నేటి సాయంత్రం నాలుగు గంటల తరువాత ఇది కాకినాడ సమీపంలో తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతానికి ఇది తీవ్ర తుపానుగానే ఉందని, 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, గాలుల వేగం మరింతగా పెరగవచ్చని తెలిపారు. ఈ మధ్యాహ్నానికి పెథాయ్ తీవ్ర తుపాను నుంచి కాస్తంత తీవ్రతను తగ్గించుకుని తుపాన్ గా మారవచ్చని వెల్లడించారు.
కాగా, గత రాత్రి నుంచి నర్సాపురం, భీమవరం తదితర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో విద్యుత్ లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. భీమవరం మండలం నాగిడిపాలెం, లోసరి, దొంగపిండి ప్రాంతాలకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. 9 మంది గర్భిణీ స్త్రీలను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పెథాయ్ హెచ్చరికల నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు రైల్వే ట్రాకులను పరిశీలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. విపత్కర పరిస్థితులు ఏర్పడితే, ప్రయాణికులకు ఆహారం అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. విజయవాడలో 9121271340, 0866-2576924 హెల్ప్ లైన్ నంబర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.