Chandrababu: రెండు రోజుల్లో పంట నష్టాన్ని అంచనా వేయాలి: సీఎం చంద్రబాబు ఆదేశాలు
- 20వ తేదీ కల్లా నష్టపరిహారం అందించేలా చూడాలి
- మత్స్యకారులకు నిత్యావసరాల ప్యాకేజ్ అందజేయాలి
- తీర ప్రాంతాల్లోని అన్ని గ్రామాల్లో ప్యాకేజ్ ఇవ్వాలి
ఏపీలో పెథాయ్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంట నష్టాన్ని రెండు రోజుల్లో అంచనా వేయాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపానుపై సచివాలయంలో చంద్రబాబు సమీక్షించారు. ఈ నెల 20వ తేదీ కల్లా నష్టపరిహారాన్ని రైతులకు అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మత్స్యకారులకు నిత్యావసరాల ప్యాకేజ్ అందజేయాలని, తీర ప్రాంతాల్లోని అన్ని గ్రామాల్లో ప్యాకేజ్ ఇవ్వాలని ఆదేశించారు. వర్ష ప్రభావం ఉన్న గ్రామాల్లో క్లోరినేషన్ చేయించాలని అన్నారు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఈ రాత్రికి భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, పద్నాలుగు వేల హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. తుపాను నష్టం వివరాలను తెలుసుకునేందుకు రేపు డ్రోన్లతో పరిశీలిస్తామని, 60 నుంచి 70 వరకు డ్రోన్లను ఇందుకోసం వినియోగిస్తామని చంద్రబాబుకు అధికారులు వివరించారు.