Jammu And Kashmir: జమ్ము కశ్మీర్ లో రేపటి నుంచి రాష్ట్రపతి పాలన!
- నేటితో ముగియనున్న గవర్నర్ పాలన
- గవర్నర్ నుంచి రిపోర్టును తెప్పించుకున్న కేంద్రం
- కోవింద్ ఆమోదించగానే రాష్ట్రపతి పాలన మొదలు
జమ్ముకశ్మీర్ లో ఆరు నెలల గవర్నర్ పాలన నేటితో ముగియనున్న నేపథ్యంలో, రేపటి నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి రానున్నట్టు తెలిసింది. గవర్నర్ పాలన ముగియగానే, రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నుంచి ఓ నివేదికను తెప్పించుకున్న కేంద్రం రాష్ట్రపతి పాలన విధించేందుకే మొగ్గు చూపినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఇప్పటికే మంత్రి మండలి ఈ నివేదికను ఆమోదించిందని, ప్రస్తుతం ఈ దస్త్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వద్ద ఉండగా, నేడు ఆయన ఆమోద ముద్ర వేస్తారని సమాచారం. కాగా, గడచిన జూన్ లో జమ్ము కశ్మీర్ లోని సంకీర్ణ కూటమి నుంచి బీజేపీ వైదొలగడంతో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం పడిపోగా, గవర్నర్ పాలన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆపై ఆరు నెలల్లో కొత్త ప్రభుత్వం లేదా అసెంబ్లీ రద్దు జరగాల్సివుండగా, రెండూ జరగలేదు. దీంతో తదుపరి ఆరు నెలలూ రాష్ట్రపతి పాలన విధించి, ఈ ఆరు నెలల్లో ఎన్నికలు జరిపించాల్సివుంటుంది. ఏ కారణం చేతనైనా వచ్చే ఆరు నెలల్లో ఎన్నికలు సాధ్యం కాకుంటే, రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించవచ్చు.