Andhra Pradesh: చంద్రబాబు వచ్చాడని తెలిసి. వెళ్లిపోయిన తుపాను కూడా వెనక్కు వచ్చింది!: విజయసాయిరెడ్డి ఎద్దేవా
- అంతటి శనిపుత్రుడు చంద్రబాబు
- చంద్రబాబు ఓటమిని ముందుగానే అంగీకరించారు
- అందుకే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు కోరుతున్నారు
తుపానులు, భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ప్రమాణస్వీకారాలు, విహారయాత్రల పేరిట టూర్లు వేస్తున్నారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు తీరును గుర్తించిన తుపాను కూడా శనిపుత్రుడు(చంద్రబాబు) రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు. మళ్లీ చంద్రబాబు ఏపీలో అడుగుపెట్టాడని గుర్తించిన పెథాయ్ తుపాను తిరిగివచ్చి ఏపీలోనే తీరం దాటిందని విమర్శించారు. చంద్రబాబు అంతటి దురదృష్ట వంతుడు, నష్ట జాతకుడు మరొకరు లేరని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు.
ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోరుతూ వైసీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన ఓటమిని ముందే అంగీకరించారని తెలిపారు. అందుకే ఈసారి ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేందుకు మోదీ సహకరించడన్న అనుమానంతోనే చంద్రబాబు ఈ కొత్త డిమాండ్ కు తెరలేపారని ఆరోపించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.