Andhra Pradesh: మడకశిర ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ నేత తిప్పేస్వామి!
- ప్రమాణం చేయించిన స్పీకర్ కోడెల
- మడకశిర అభివృద్ధి కోసం పనిచేస్తానని ప్రకటన
- ఈరన్న ఎన్నిక చెల్లదని ప్రకటించిన సుప్రీంకోర్టు
అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా వైసీపీ నేత తిప్పేస్వామి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయన చేత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. టీడీపీ నేత ఈరన్న ఎన్నికల సందర్భంగా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని తిప్పేస్వామి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈరన్న ఎన్నిక చెల్లదని ప్రకటించగా, సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో ఈరన్న తన పదవికి రాజీనామా సమర్పించారు.
తాజాగా ఎమ్మెల్యే బాధ్యతలు స్వీకరించిన అనంతరం వైసీపీ నేత తిప్పేస్వామి మీడియాతో మాట్లాడుతూ.. సాధారణంగా ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై 6 నెలల్లో తీర్పు రావాలని తెలిపారు. కానీ ఈ కేసులో మాత్రం నాలుగున్నరేళ్ల తర్వాత తీర్పు వచ్చిందని వెల్లడించారు. ఏదేమయినా చివరికి న్యాయం జరిగిందని పేర్కొన్నారు.
హంద్రీనీవా కాలువ ద్వారా మడకశిరకు నీళ్లు ఇప్పటివరకూ అందలేదన్నారు. ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీనీవా పనులు 80 శాతం పూర్తయినా టీడీపీ ప్రభుత్వం ఇంకా నీళ్లు అందించలేకపోవడం దారుణమని విమర్శించారు. మడకశిరతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం వైసీపీ అధినేత జగన్ నాయకత్వంలో పనిచేస్తానని ప్రకటించారు.