Andhra Pradesh: టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఢిల్లీ హైకోర్టులో ఊరట!
- ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఈడీకి ఆదేశం
- రాజకీయ కక్షతోనే కేసులన్న సుజనా
- జనవరి 16 వరకూ విచారణ వాయిదా
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఢిల్లీ హైకోర్టు ఊరట నిచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంకులను రూ.5,700 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువును పొడిగించింది. సుజనా చౌదరిపై 2019, జనవరి 16 వరకూ ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఈడీ అధికారులను ఆదేశించింది.
ఈ సందర్భంగా సుజనా చౌదరి తరఫు న్యాయవాది కోర్టులో వాదిస్తూ.. రాజకీయ కక్షతోనే తన క్లయింట్ పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చిన నేపథ్యంలో సుజనను వేధిస్తున్నారని విన్నవించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 16కు వాయిదా వేసింది.