trinamul congress: ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడానికి ఇది సరైన సమయం కాదు: మమతా బెనర్జీ
- ముందు ఎన్నికలు జరగనివ్వండి
- సమష్టి నిర్ణయమే ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తుంది
- కూటమి పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి
జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీలతో మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం విదితమే. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే తమ ప్రధాన అభ్యర్థి అని డీఎంకే అధినేత స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆయా పార్టీల్లో అలజడి సృష్టించాయి.
ఈ వ్యాఖ్యలపై కూటమిగా ఏర్పడదలచుకున్న పార్టీల నేతల్లో కొందరు ఇప్పటికే విమర్శలు గుప్పించారు. తాజాగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ స్పందిస్తూ, ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడానికి ఇది సరైన సమయం కాదని అన్నారు. ముందు ఎన్నికలు జరగనివ్వండి, సమష్టిగా తీసుకునే నిర్ణయమే ప్రధాని అభ్యర్థి ఎవరన్నది నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. కూటమిగా ఏర్పడనున్న రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పని చేస్తున్నాయని చెప్పారు.