doctor jayachandran: చెన్నైలోని 'పేదల డాక్టర్' జయచంద్రన్ కన్నుమూత!
- చెన్నై మహానగరంలో రూ.5లు డాక్టర్‌గా ఖ్యాతి
- పేదల పెన్నిధిగా, ఆపద్బాంధువుడిగా గుర్తింపు
- వాషర్మెన్ పేటలో అలముకున్న విషాదం
‘వైద్యనారాయణుడు’ అన్న మాటను అక్షర సత్యం చేసి ప్రజావైద్యుడిగా జనం గుండెల్లో చిరస్మరణీయ స్థానాన్ని సొంతం చేసుకున్న డాక్టర్ జయచంద్రన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జయచంద్రన్ ఓ పైవ్రేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 71 సంవత్సరాలు.
చెన్నై మహానగరంలోని వాషర్‌మెన్‌పేటలో 'ఐదు రూపాయల డాక్టర్' అంటే చిన్నపిల్లాడిని అడిగినా చెప్పేంతగా అభిమానుల గుండెల్లో గూడుకట్టుకున్న ప్రజావైద్యుడు జయచంద్రన్. నిరుపేదల పెన్నిధిగా, ఆపన్నుల ఆపద్బాంధువుడిగా దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. ఆయన మృతి వార్తతో స్థానికులు సొంత కుటుంబంలోని వ్యక్తి చనిపోయినంతగా భోరుమన్నారు.
జయచంద్రన్ కుటుంబ సభ్యులంతా వైద్యులే. ఆయన భార్య వేణి చెన్నై ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డీన్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. కుమార్తె శరణ్య స్టాన్లీ ఆస్పత్రిలో వైద్యురాలు. పెద్ద కొడుకు శరత్ ఓమందూర్ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో, చిన్నకొడుకు శరవణన్ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యులుగా పనిచేస్తున్నారు. కాంచీపురం జిల్లా కొడైపట్టినం గ్రామానికి చెందిన జయచంద్రన్ 1947లో పుట్టారు. మద్రాస్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యనభ్యసించిన ఆయన చదువు పూర్తికాగానే వాషర్మెన్ కాలనీలో క్లినిక్ ఏర్పాటుచేసి పేదల సేవకే అంకితమయ్యారు.
తొలి రోజుల్లో రూ.2 ఫీజు వసూలు చేసేవారు. నర్సులు, ఇతర సిబ్బంది జీతాలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అన్ని పనులు తానే చేసుకునే వారు. డాక్టర్ జయచంద్రన్ సేవాతత్పరతను గుర్తించిన కొందరు నర్సులు స్వచ్ఛందంగా క్లినిక్‌లో సేవలందించేవారు. పేదలు, గుడిసెవాసులే ఎక్కువగా జయచంద్రన్ వద్ద వైద్యం పొందేవారు.
ఈ ప్రజా వైద్యుని మరణవార్త స్థానికంగా విషాదం నింపింది. ఆయన భౌతిక కాయాన్ని వాషర్మెన్ పేట వెంకటేశన్ వీధిలోని స్వగృహం వద్ద ఉంచగా వేలాది మంది దర్శించుకుని కన్నీటిపర్యంతమయ్యారు. పలువురు రాజకీయ, అధికార ప్రముఖులు కూడా జయచంద్రన్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళుర్పించారు.