resevebank cash: కోట్ల రూపాయల నగదుతో బయలుదేరిన కంటైనర్లు.. అర్ధరాత్రి రోడ్డుపై నిలిచిపోయిన వైనం!
- చెన్నె- బెంగళూరు జాతీయ రహదారిలో అంబూరు వద్ద ఘటన
- రాత్రి 10 గంటలకు నిలిచిపోగా 12 గంటల తర్వాత మళ్లీ ప్రయాణం
- స్థానిక పోలీసుల సహాయం కోరిన కంటైనర్లతో వెళ్తున్న భద్రతా సిబ్బంది
రిజర్వ్ బ్యాంక్ నుంచి 80 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లను తీసుకువెళ్తున్న కంటైనర్లు ఆ రెండూ. ఇంజన్ మొరాయించడంతో రాత్రి 10 గంటల సమయంలో ఓ కంటైనర్ జాతీయ రహదారిపై నిలిచిపోయింది. దీంతో వెనుక వస్తున్న మరో కంటైనర్ కూడా ఆగిపోయింది. భద్రతగా వెళ్తున్న పోలీసుల్లో ఒకటే టెన్షన్.
వివరాల్లోకి వెళితే...చెన్నైలోని రిజర్వ్‌బ్యాంక్ శాఖ నుంచి నగదును తీసుకుని రెండు కంటైనర్లు హోసూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బయలుదేరాయి. చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఈ కంటైనర్లలో ఒకదాని ఇంజన్ మొరాయించడంతో రాత్రి పది గంటల సమయంలో తమిళనాడులోని అంబూరు వద్ద రోడ్డు మధ్యన నిలిచిపోయింది.
దాంతో దీని వెనుక వస్తున్న మరో కంటైనర్ కూడా ఆగిపోయింది. వాహనాలకు భద్రతగా వెళ్తున్న పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని భద్రత కల్పించారు. దాదాపు రెండు గంటలపాటు మరమ్మతుల అనంతరం కంటైనర్లు తిరిగి బయలుదేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.