cpi: ఇదే పద్ధతి కొనసాగితే పార్టీలో నేను, మరో ఒకరిద్దరే మిగులుతారు!: సీపీఐ నేత నారాయణ
- ఇటీవలి ఎన్నికల్లో వామపక్షాలకు చేదు అనుభవం
- పార్టీ సభ్యత్వాల కన్నా సీపీఐకి తక్కువ ఓట్లొచ్చాయి
- కొన్ని చోట్ల వామపక్షాలకు అభ్యర్థులు కూడా లేరు
ఐదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వామపక్ష పార్టీలకు చేదు అనుభవం ఎదురైందని సీపీఐ నేత నారాయణ అన్నారు. విశాఖలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వాల సంఖ్య కన్నా తక్కువగా తమ పార్టీకి ఓట్లు వచ్చాయని, ఇదే పద్ధతి కొనసాగితే పార్టీలో ‘నేను, మరో ఒకరిద్దరు మాత్రమే ఉంటారు’ అని తమ పార్టీపై ఆయనే సెటైర్లు వేసుకున్నారు. కొన్ని చోట్ల వామపక్షాలకు అభ్యర్థులు కూడా లేరని, కొత్తవారు చేరకపోవడం వల్ల పార్టీ మనుగడకు ప్రమాదమని గుర్తించామని అన్నారు. రాష్ట్రాల్లో నెలకొన్న ఆయా రాజకీయ పరిస్థితులను అనుసరించి స్వల్పకాలిక వ్యూహాలతో ముందుకు వెళ్తామని చెప్పారు.
జనవరి 1న కేరళలో 50 లక్షల కుటుంబాలు నిరసన
శబరిమల అంశాన్ని మతపరమైన సెంటిమెంట్ గా చిత్రీకరించి కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని బీజేపీ ప్రయత్నించిందని నారాయణ ఆరోపించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని సమర్థిస్తూ జనవరి 1న కేరళలో 50 లక్షల కుటుంబాలు నిరసన తెలియజేయనున్నాయని అన్నారు. ప్రణాళికాబద్ధంగా ఆర్బీఐని ధ్వంసం చేయాలని మోదీ యత్నిస్తున్నారని ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు తమతో కలిసి వచ్చే ప్రతిపార్టీని కలుపుకుని ముందుకెళ్తామని స్పష్టం చేశారు. రక్షణ రంగాన్ని, కోర్టులను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఆర్బీఐపై పెత్తనం చలాయించాలని కేంద్రం కనుక చూస్తే, అది దివాళా తీయడం ఖాయమని అభిప్రాయపడ్డారు.