voter call centre: నామినేషన్ల చివరి రోజు వరకు ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవచ్చు.. ఏపీలో కాల్ సెంటర్ ఏర్పాటు!

  • ఇందుకోసం ప్రత్యేక కాల్‌సెంటర్‌ ప్రారంభించిన ఎన్నికల సంఘం
  • విజయవాడలో ప్రారంభించిన సీఈఓ సిసోడియా
  • ప్రత్యేక యాప్‌ కూడా

ఓటరు జాబితాలో మీ పేరు లేదా... గతంలో ఉన్నా ఎవరో కావాలనే తొలగించేశారని అనుమానిస్తున్నారా? ఈ విషయంలో ఎవరికి ఫిర్యాదు చేయాలి? మళ్లీ ఓటు హక్కు ఎలా పొందాలి? అని ఆందోళన చెందుతున్నారా? ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకే ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

విజయవాడలోని భారతీనగర్‌లో ఏర్పాటైన ఈ కాల్‌సెంటర్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈఓ) ఆర్‌.పి.సిసోడియా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కాల్‌సెంటర్‌ మాదిరిగానే జిల్లాల్లో కూడా కాల్‌ సెంటర్లను ప్రారంభించాలని కలెక్టర్లకు సూచించినట్లు తెలిపారు. ఆయా జిల్లాల కాల్‌ సెంటర్లకు ప్రత్యేక ఫోన్‌ నంబర్లను కేటాయించినట్లు తెలిపారు. ఈ సెంటర్లలో నామినేషన్ చివరి రోజు వరకు ప్రజలు తమ ఓటును నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఓటరు సమస్యల పరిష్కారం కోసం త్వరలో ప్రత్యేక యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.

ఈ కాల్‌ సెంటర్‌ ప్రతిరోజూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంట వరకు పనిచేస్తుంది. పది మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత 24 గంటలు పనిచేస్తుంది. మూడు షిప్టుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ఈ సెంటర్‌ కోసం మొత్తం 30 ఫోన్ లైన్లు తీసుకున్నారు. ఈ నంబర్లకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఉంది.

అయితే ఈ కాల్‌సెంటర్‌కు నేరుగా వెళ్లి వివరాలు తెలుసుకునేందుకు అవకాశం ఉండదు. ఇందుకోసం ఏర్పాటుచేసిన 1950 నంబర్‌కి ఫోన్‌ చేయాలి. ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాధానం వస్తుంది. వ్యక్తిగత ఫోన్‌ నంబరు 9491111091కి ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ మెసేజ్‌లు, వాయిస్‌ రికార్డు పంపినా సమస్యకు తగిన సమాధానం అందుతుంది. ప్రజలు www.ceoandhra.nic.in, www.nvsp.in వెబ్‌సైట్‌లలో లాగిన్‌ అయి తమ ఓటుహక్కు గురించి తెలుసుకోవచ్చు. ap votevoter id అని టైపు చేసి 9223166166 లేదా 51969కు ఎస్ ఎం ఎస్ పంపినా సమాధానం వస్తుంది.

జిల్లాల వారీగా కాల్‌సెంటర్ల నంబర్లు ఇవీ. శ్రీకాకుళం (18004-256625), విజయనగరం (08922-278770 లేదా 1070 ల్యాండ్‌లైన్‌), విశాఖపట్నం (18004-250000), తూర్పుగోదావరి (0884-2351900), పశ్చిమగోదావరి (08812-251955), కృష్ణా (9121295812), గుంటూరు (0863-2233167), ప్రకాశం (7382578770), నెల్లూరు (18004250499), కర్నూలు (08518-277305), కడప (08562-249788), అనంతపురం (08554-220000/8374451419), చిత్తూరు (0857-2240899/8332988681).

  • Loading...

More Telugu News