pruthvi: సీనియర్ హీరో హరనాథ్ ను అలా చూస్తానని అనుకోలేదు: కమెడియన్ పృథ్వీ
- ఒక రోజున పద్మాలయ స్టూడియోకి వెళ్లాను
- గేటు దగ్గర హరనాథ్ ను చూశాను
- ఆయన దీన స్థితిని కృష్ణగారికి చెప్పాను
చిత్రపరిశ్రమలో ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగినవాళ్లు ఎంతమంది వున్నారో .. ఏదో ఒక బలహీనత కారణంగా ఆర్ధికంగా చితికిపోయిన వాళ్లూ అంతేమంది వున్నారు. ఆర్ధికపరమైన విషయాల్లో జాగ్రత్త ఉండకపోతే చివరిదశలో చాలా కష్టాలను అనుభవించవలసి వస్తుందనడానికి ఉదాహరణ అలనాటి హీరో హరనాథ్ జీవితమేనని తాజా ఇంటర్వ్యూలో కమెడియన్ పృథ్వీ చెప్పుకొచ్చారు.
" అవి నేను సీరియల్స్ లో నటిస్తోన్న రోజులు. ఒక రోజున నేను పద్మాలయ స్టూడియోలోకి వెళుతూ ఉండగా, చిరిగిపోయిన చొక్కాతో .. గెడ్డం పెంచుకుని గేటు దగ్గర ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన కృష్ణగారిని కలవాలని అడుగుతుంటే .. సెక్యూరిటీ వాళ్లు లోపలికి పంపించడం లేదు. ఆయనని నేను గుర్తుపట్టి 'మీరు హీరో హరనాథ్ కదా' అన్నాను. ఆయన 'అవును' అని చెప్పారు.దాంతో నేను ఆయనని లోపలికి తీసుకెళ్లి, ఆయన దీనస్థితిని కృష్ణ గారికి చెప్పాను. కృష్ణగారు చెప్పడంతో హరనాథ్ స్నానానికి ఏర్పాటు చేసి .. ఆయనకి కొత్తబట్టలు ఇచ్చారు. అలా వచ్చిన హరనాథ్ ని కృష్ణగారు కొన్ని రోజుల పాటు ఎలాంటి లోటు లేకుండా చూసుకుని చెన్నైకి పంపించారు. ఆ తరువాత రెండు మూడు రోజులకే హరనాథ్ చనిపోయారు. అందుకే ఆర్టిస్టులు ఆర్ధిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా వుండాలి' అని అన్నారు.