imran khan: పాకిస్థాన్ ప్రధాని వ్యాఖ్యలపై దీటుగా స్పందించిన భారత్
- కశ్మీరీలు తమ భవిష్యత్తును వారే నిర్ణయించుకోవాలన్న ఇమ్రాన్ ఖాన్
- మీ పని మీరు సక్రమంగా చేసుకుంటే చాలన్న భారత్
- సొంత దేశంలో ఉన్న ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని సూచన
కశ్మీర్ లో ప్రజలపై జరుగుతున్న దాడులపై చింతిస్తున్నానని... వారి భవిష్యత్తు ఏంటో కశ్మీరీలు నిర్ణయించుకోవాలని.. కశ్మీర్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తుతామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ దీటుగా స్పందించారు.
కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ చాలా ఎక్కువగా స్పందిస్తోందని ఆయన మండిపడ్డారు. వారి పని వారు సక్రమంగా చేసుకుంటే మంచిదని చెప్పారు. భారత్ గురించి కాకుండా వారి దేశంలోని అంతర్గత పరిస్థితుల గురించి పట్టించుకుంటే బాగుంటుందని అన్నారు. పాకిస్థాన్ లో ఉగ్రవాదులను నిర్మూలిస్తే... కశ్మీర్ లో దాడులు జరగవని చెప్పారు. కశ్మీర్ లో ఉగ్రదాడులకు పాకిస్థానే కారణం అనే విషయాన్ని వారు తెలుసుకోవాలని సూచించారు. సొంత దేశంలో ఉన్న ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకుండా... ఇతర దేశాలను విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు.
డిసెంబర్ 15న పుల్వామాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో మరో ఏడుగురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలయ్యాయి.