kcr: విశాఖ శారదా పీఠాన్ని సందర్శించి.. పలు రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటన.. వివరాలు!
- ఈ నెల 23 నుంచి 25 వరకు కేసీఆర్ పర్యటన
- ఒడిశా, పశ్చిమబెంగాల్ తో పాటు ఢిల్లీలోనూ పర్యటన
- పలు పార్టీల అగ్రనేతలతో భేటీ కానున్న కేసీఆర్
దేశ రాజకీయాల్లో మార్పు తీసుకువస్తానని, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీల అగ్రనేతలను కేసీఆర్ కలవనున్నారు. ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ పర్యటించనున్నారు.
ఈ నెల 23న ప్రత్యేక విమానంలో కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు విశాఖకు చేరుకుని, శారదా పీఠాన్ని సందర్శించి, స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకోనున్నారు. ఆ పీఠంలో ఉన్న రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించనున్నారు. ఆశ్రమంలోనే ఆరోజు మధ్యాహ్నభోజనం చేయనున్నట్టు సమాచారం. అనంతరం, విశాఖ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు కేసీఆర్ వెళతారు. 23వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ అవుతారు. ఆరోజు రాత్రికి కేసీఆర్ అక్కడే బస చేస్తారు.
మర్నాడు ఉదయం అంటే 24వ తేదీన కోణార్క్, జగన్నాథస్వామి దేవాలయాలను కేసీఆర్ సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనానంతరం ప్రత్యేక విమానంలో పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాకు కేసీఆర్ బయలుదేరి వెళతారు. ఆరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో సీఎం మమతా బెనర్జీని కలుసుకుంటారు. అనంతరం, కాళీమాత ఆలయాన్ని కేసీఆర్ సందర్శిస్తారని సమాచారం.
ఇక అదేరోజు రాత్రి పశ్చిమ బెంగాల్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఈ నెల 25వ తేదీ నుంచి వరుసగా రెండుమూడ్రోజుల పాటు అక్కడే బస చేస్తారని సమాచారం. ఢిల్లీ పర్యటనలో మోదీని మర్యాదపూర్వకంగా కేసీఆర్ కలవనున్నారు. ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులతో ఆయన సమావేశమవుతారని సమాచారం. సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో కూడా కేసీఆర్ భేటీ కానున్నారు.