Amit Shah: అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై మోహన్ భగవత్‌తో అమిత్‌షా చర్చలు
- రాజస్థాన్ లోని రాజ్‌కోట్‌లో జరుగుతున్న హిందూ ఆచార్య సభలో భేటీ
- జనవరిలో సుప్రీం కోర్టులో విచారణకు రానున్న అంశంపై ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో చర్చ
- మోదీ పదవీ కాలం ముగిసేలోగానే నిర్మాణం పూర్తిచేసే యోచన
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడం, అయోధ్యలోని వివాదాస్పద స్థలం అంశం జనవరిలో సుప్రీం కోర్టు విచారణకు రానుండడంతో కేంద్రంలోని బీజేపీ మందిర నిర్మాణ అంశంపై వడివడిగా అడుగులు వేస్తోంది. రాజస్థాన్ లోని రాజ్‌కోట్‌లోని ఆర్ష విద్యా మందిర్‌లో జరుగుతున్న హిందూ ఆచార్య సభకు హాజరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భేటీ అయ్యారు. వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మాణంపై ఈ సందర్భంగా చర్చించారు. సభకు హాజరైన పలువురు సాధువులు మందిర నిర్మాణంపై పట్టుబట్టినట్లు సమాచారం.
వచ్చే ఏడాది మేతో మోదీ పదవీ కాలం ముగుస్తున్నందున ఈలోగానే మందిర నిర్మాణం పూర్తి చేయాలని సభకు వచ్చిన వారంతా డిమాండ్ చేయడంతో అయోధ్యలో మందిరం నిర్మించడం ఖాయమని అమిత్‌షా సభాముఖంగా తెలిపినట్లు తెలిసింది. వచ్చే రెండు మూడు నెలల్లో బీజేపీ ప్రభుత్వం మందిర నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు జోథ్‌పూర్‌కు చెందిన ఆచార్య సత్‌గిరి మహారాజ్ చెప్పడం ఈ మాటలకు బలం చేకూరుస్తోంది.
మరోవైపు ఆలయ నిర్మాణం అంశంలో సుప్రీం కోర్టు తీర్పు అనుకూలంగా వెలువడే అవకాశం ఉందని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి విలేకరులకు తెలిపారు. విచారణ ఎప్పుడు ప్రారంభమయ్యేది చెప్పలేనన్నారు. కాగా, మందిర నిర్మాణం విషయంలో బీజేపీ పట్టుదలగా ఉన్నా ఆలయం కోసం ఆర్డినెన్స్ జారీ చేయాలన్న హిందుత్వవాదుల డిమాండ్‌పై మాత్రం బహిరంగ ప్రకటన చేయక పోవడం గమనార్హం.