Naseeruddin Shah: ఆందోళనలతో వెనక్కి తగ్గిన బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా.. అజ్మీర్ కార్యక్రమం రద్దు
- గోహత్యల పేరుతో జరుగుతున్న హింసపై స్పందించిన నసీరుద్దీన్ షా
- తన పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నటుడు
- ఆందోళనకు దిగిన బీజేవైఎం కార్యకర్తలు
తన పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఇటీవల గోరక్షకుల హింసాకాండను ప్రస్తావిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేశంలో పోలీసు అధికారి కంటే గోవులకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా రైట్ వింగ్ కార్యకర్తల ఆందోళనతో నసీరుద్దీన్ వెనక్కి తగ్గారు. శుక్రవారం ‘అజ్మీర్ లిటరేచర్ ఫెస్టివల్’లో షా పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. ఈ కార్యక్రమం నిర్వహించనున్న ఇండోర్ స్టేడియం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న బీజేవైఎం కార్యకర్తలు నసీరుద్దీన్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. షాను ఇక్కడికి రానిచ్చేది లేదంటూ నినాదాలు చేశారు. నల్ల జెండాలు చూపించారు. ఫెస్టివల్‌కు సంబంధించిన పోస్టర్లను తగలబెట్టారు.
ఇంత జరుగుతున్నా, అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. అక్కడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నా పోలీసులు కిమ్మనకుండా ఉండడం గమనార్హం. దీంతో పరిస్థితి చేయిదాటిపోతున్నట్టు గ్రహించిన నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేశారు.