Andhra Pradesh: మరికాసేపట్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్న కొండా మురళి!
- ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన టీఆర్ఎస్
- అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి మురళి
- సభాపతికి ఇప్పటికే టీఆర్ఎస్ ఫిర్యాదు
కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ కొండా మురళి రాజీనామాకు రంగం సిద్ధమయింది. తనకు పదవులు ముఖ్యం కాదనీ, ఆత్మగౌరవమే ముఖ్యమని మురళి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండగా అందుకున్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించారు. ఇందుకోసం మండలి చైర్మన్ స్వామిగౌడ్ అపాయింట్ మెంట్ కోరగా, ఆయన ఈరోజు తనను ఛాంబర్ లో కలుసుకోవాలని సూచించారు.
ఈరోజు ఉదయం 10.30 గంటలకు స్వామి గౌడ్ ను కలుసుకోనున్న కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించనున్నారు. తెలంగాణ ఎన్నికలకు ముందు పార్టీ మారిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఇప్పటికే సభాపతికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన చర్యలు తీసుకుని తొలగించకముందే గౌరవంగా తప్పుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మురళి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.