Telangana: మాకు నైతిక విలువలు ఉన్నాయి.. అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా!: కొండా మురళి
- స్వామిగౌడ్ కు రాజీనామా ఇచ్చిన మురళి
- షోకాజ్ నోటీసు పంపిస్తామని బెదిరించారని వ్యాఖ్య
- కాంగ్రెస్ నేతలను ప్రలోభపెడుతున్నారని ఆరోపణ
తెలంగాణ ఎమ్మెల్సీ కొండా మురళి తన రాజీనామాను సమర్పించారు. భార్య సురేఖతో కలిసి ఈ రోజు ఉదయం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఛాంబర్ కు చేరుకున్న మురళి తన రాజీనామాను ఆయనకు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను తెలంగాణ శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యానని గుర్తుచేశారు. అలాంటి తనకే షోకాజ్ నోటీసులు ఇస్తామని టీఆర్ఎస్ బెదిరించిందని ఆరోపించారు. టీఆర్ఎస్ తరఫున మండలికి ఎన్నికయినందున విలువలకు కట్టుబడి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టి తమ పార్టీలో చేర్చుకున్నారనీ, పార్టీని విలీనం చేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దురహంకారపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లేవారికి తొలుత ఇంటికి పిలిచి భోజనం పెడతారనీ, ఆ తర్వాత మాత్రం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి పోతున్న వాళ్లంతా ఆత్మాభిమానం చంపుకునే వెళుతున్నారని వ్యాఖ్యానించారు.