prajakutami: అందుకే, ప్రజాకూటమి ఓటమిపాలైంది: సీపీఐ నేత చాడ
- సీట్ల సర్దుబాటులో జాప్యం వల్లే కూటమి ఓడింది
- పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ లో ఓట్ల సంఖ్యే ఎక్కువ
- కేసీఆర్ కనుసన్నల్లో ఈసీ నడిచింది
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ లు కూటమిగా ఏర్పడి బరిలోకి దిగినప్పటికీ, ఊహించిన స్థానాలు సాధించలేకపోయింది. సీపీఐ తరపున హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన చాడ వెంకటరెడ్డి ఈ విషయమై స్పందించారు.
సీట్ల సర్దుబాటులో జాప్యం కారణంగానే ప్రజాకూటమి ఓటమిపాలు కావాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ లో వచ్చిన ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉందని, కేసీఆర్ కనుసన్నల్లో ఈసీ నడిచిందని ఆరోపించారు. ప్రజాకూటమి అజెండాను కేసీఆర్ హైజాక్ చేశారన్న చాడ, కూటమిలో కొనసాగే విషయమై జాతీయ నాయకత్వంతో చర్చించాల్సి ఉందని స్పష్టం చేశారు.