Rahul Gandhi: మమతా బెనర్జీతో పొత్తు లేనట్టే.. తేల్చేసిన రాహుల్ గాంధీ!
- పశ్చిమబెంగాల్ లో ఒంటరిగానే పోటీ అని ప్రకటించిన రాహుల్
- బీజేపీ, టీఎంసీలపై పోరాడాలంటూ శ్రేణులకు పిలుపు
- ఫిబ్రవరిలో కోల్ కతాలో భారీ ర్యాలీకి సిద్ధమవుతున్న కాంగ్రెస్
జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న మహాకూటమికి ఆదిలోనే ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. పశ్చిమబెంగాల్ లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని... బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (మమత పార్టీ)లపై పోరాడాలని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తో ముందస్తు పొత్తు వార్తలను టీఎంసీ కొట్టేసిన నేపథ్యంలో, రాహుల్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు, ఫిబ్రవరిలో కోల్ కతాలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి రాహుల్ హాజరయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన తేదీని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్-టీఎంసీల మధ్య మహాకూటమి కానీ, పొత్తు కానీ ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.