Andhra Pradesh: పెథాయ్ తుపానుతో నాశనమైన పంట.. తట్టుకోలేక ఆగిన రైతన్న గుండె!
- గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో ఘటన
- కౌలు భూమిలో పంట వేసిన సుబ్బయ్య
- పెథాయ్ తో తుడిచిపెట్టుకుపోయిన పంట
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ను తాకిన పెథాయ్ తుపాను రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పంట కోతకొచ్చిన సమయంలో తుపాను తీరాన్ని తాకడంతో రైతన్నల పంటలన్నీ దెబ్బతిన్నాయి. తాజాగా అప్పు చేసి మరీ పంట వేసిన ఓ రైతు చివరికి తన కష్టమంతా తుపాను పాలు కావడంతో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని చేబ్రోలు మండలం గొల్లపాలెంకు చెందిన ఆలపాటి సుబ్బయ్య (65) ఓ రైతు. దాదాపు 12 ఎకరాలను ఆయన కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. అయితే ఇటీవల వచ్చిన పెథాయ్ దెబ్బకు పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో చేసిన అప్పులు తీర్చేది ఎలా? అని సుబ్బయ్య మనస్తాపానికి లోనయ్యాడు.
ఈ క్రమంలో ఒక్కసారిగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయన అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, సుబ్బయ్య కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని అధికారులు తెలిపారు.