Hyderabad District: తెలంగాణను కమ్మేస్తున్న వాయు కాలుష్యం మబ్బులు
- రోజురోజుకీ క్షీణిస్తున్న గాలి నాణ్యత
- ధూళి కణాలతోపాటు 40 రకాల ఉద్గారాలు
- ఊపిరితిత్తుల్లోకి చేరితే హానికరం
తెలంగాణ రాష్ట్రంపై వాయుకాలుష్యం మబ్బులు కమ్ముకుంటున్నాయి. రాజధాని హైదరాబాద్‌తోపాటు పరిసర జిల్లాలకూ రోజురోజుకీ ప్రమాదం విస్తరిస్తోంది. గాలిలో ప్రమాదకర కర్బన ఉద్గారాలు, ధూళికణాలు అధికమవుతున్నాయి. చలికాలం ప్రవేశించడంతో ప్రభావం మరీ తీవ్రంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
రోజురోజుకీ గాలి నాణ్యత మరింత క్షీణించి మనిషి ఆరోగ్యానికి సవాల్ విసురుతోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు, వాహనాలు, భారీ భవనాల నిర్మాణాల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి వాయుకాలుష్యానికి కారణమవుతున్నాయి. జనాభాకు తగ్గట్టు అవసరాలు పెరుగుతున్నా కాలుష్యం నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఎక్కువయ్యాయి.
గాలిలోకి విడుదలవుతున్న సూక్ష్మ, అతిసూక్ష్మ ధూళికణాలు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. వర్షాకాలంలో ఇవి వర్షంతోపాటు భూమిపైకి చేరుతాయి. వేసవిలో గాల్లో కలిసి పైకి వెళ్లిపోతాయి. కానీ శీతాకాలంలో ఎక్కడివక్కడే స్తబ్ధుగా ఉండిపోతాయి. ఈ గాలిని పీల్చితే ఉద్గారాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి అనారోగ్యానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాలుష్యం పెరగకుండా కొంతవరకు అరికట్టవచ్చునని సూచిస్తున్నారు. ముఖ్యంగా భారీ వాహనాలు ఓవర్‌లోడ్‌తో వెళ్లేటప్పుడు కాలుష్య ఉద్గారాలు అధికంగా విడుదల కాకుండా అరికట్టాలి. అలాగే వాహనాల ఇంధనం కల్తీకాకుండా చూడాలి. పార్కింగ్ లాట్లు, మంచి రోడ్లు ఉంటే వాహన కాలుష్యాన్ని కొంతవరకు నియంత్రించవచ్చు.