Hyderabad: ఇదో టైపు దొంగతనం: ఇంట్లో ఉన్న డబ్బు తీసుకురా... అనగానే తెచ్చిచ్చిన ఐదేళ్ల బుడతడు!
- ఇంట్లో డబ్బులు పెట్టి వెళ్లిన నియామతుల్లాఖాన్
- ఆగంతుకుడు వచ్చి అడిగితే తెచ్చిచ్చిన చిన్నారి
- కేసును విచారిస్తున్న పోలీసులు
కల్లాకపటం తెలియని తన బిడ్డ చేసిన పనికి ఇప్పుడో వ్యక్తి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇంట్లో ఉంచిన నగదును ఐదేళ్ల బుడతడు అపరిచితుడికి ఇవ్వడమే ఇందుకు కారణం. హైదరాబాదు, మలక్ పేట పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, మూసారాంబాగ్, శాలివాహననగర్ కు చెందిన నియామతుల్లాఖాన్ (33) సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. ఇసుక తీసుకొచ్చేందుకు వెళ్తూ, తన వద్ద ఉన్న రూ.1.94 లక్షలను బీరువాలో ఉంచాడు. అదే సమయంలో అతని భార్య సమీరా, దగ్గర్లోనే ఉండే తల్లి ఇంటికి వెళ్లింది.
కాసేపటికి ఓ అపరిచిత వ్యక్తి వచ్చి, నియామతుల్లాఖాన్ కుమారుడు మహీర్ (5)ను పలకరించాడు. ఇంట్లో డబ్బులున్నాయా? అంటే ఉన్నాయన్నాడు. తీసుకురా... అని అడుగగా, తండ్రి తెచ్చిపెట్టిన డబ్బులను తెచ్చిచ్చాడు. వాటిని తీసుకున్న అపరిచితుడు వెంటనే అక్కడి నుంచి చల్లగా జారుకోగా, ఇంటికొచ్చి విషయం తెలుసుకున్న తండ్రి అవాక్కై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.