Jagan: ఫోన్ చేసి వైఎస్ జగన్ లా మాట్లాడుతూ.. బెదిరింపులు, డబ్బు డిమాండ్!
- జగన్ సహాయకుడి ఫోన్ నంబర్ కనిపిస్తూ రింగ్
- ఎత్తితే తానో మెసేజ్ పంపుతానని చెప్పే జగన్!
- ఆపై డబ్బులు ఇవ్వాలని మెసేజ్
- హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన వైకాపా
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మాదిరిగా మాట్లాడుతూ బెదిరింపులకు దిగుతూ, డబ్బు పంపాలని ఆగంతుకులు డిమాండ్ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. తాము ఫోన్ చేస్తే, వైఎస్ జగన్ పక్కనే నిత్యమూ ఉండే సహాయకుడు నాగేశ్వరరెడ్డి నంబర్ కనిపించేలా మాయ చేశారని ఆరోపించిన వారు, తొలుత జగన్ మాట్లాడతారని చెబుతారని, ఆపై జగన్ గొంతును మిమిక్రీ చేస్తూ, మరో వ్యక్తి మాట్లాడుతున్నారని చెప్పారు.
మీ ఫోన్ కు ఓ మెసేజ్ వస్తుందని, దాన్ని ఫాలో అవండి అని జగన్ చెప్పినట్టుగా చెబుతూ, ఆపై డబ్బులు పంపాలని మెసేజ్ పెడుతున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. నియోజకవర్గ ఇన్ చార్జ్ లు, పార్టీ నాయకులు, ప్రముఖులకు ఇలా ఫోన్లు వస్తున్నాయని వెల్లడించిన వారు, దీనిపై పోలీసులు తక్షణం విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వైకాపా న్యాయవిభాగం అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఐటీ విభాగం ప్రతినిధి హర్షవర్ధన్ తదితరులు హైదరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు.