Chandrababu: చంద్రబాబు, జగన్ లకు బహిరంగ లేఖ రాసిన మైసూరారెడ్డి!
- నీటి కేటాయింపులో అన్యాయం చేస్తున్నారు
- హైకోర్టు ఏర్పాటు విషయంలో మరోసారి అన్యాయం
- పట్టిసీమ ద్వారా సీమకు నీళ్లు రావడంలేదు
కృష్ణా, గోదావరి జలాల కేటాయింపులో రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని పార్లమెంటు మాజీ సభ్యుడు మైసూరారెడ్డి ఆరోపించారు. రాయలసీమకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా రావడం లేదని వ్యాఖ్యానించారు. సాగు, తాగునీటిని అందిస్తామంటూ నేతలు చెప్పే మాటలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్ లకు మైసూరారెడ్డి బహిరంగ లేఖ రాశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో ఎక్కువగా నష్టపోయింది రాయలసీమ ప్రాంతమేనని మైసూరారెడ్డి తెలిపారు. తాజాగా ఇప్పుడు రాజధానితో పాటు హైకోర్టును కూడా ఒకేచోట నిర్మించి సీమకు మరోసారి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమకు నీళ్లు ఇస్తున్నారన్న వాదనల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. రాయలసీమకు నీటి కేటాయింపు విషయంలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న న్యాయవాదుల డిమాండ్ కు మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు.