Telangana: బీసీలను కేసీఆర్ వెన్నుపోటు పొడిచారు: బీజేపీ నేత లక్ష్మణ్
- స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఏ ప్రాతిపదికన విడుదల చేశారు?
- బీసీల రిజర్వేషన్లు 22 శాతానికి ఎలా కుదించారు?
- ఈ ఆర్డినెన్స్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. గత ముప్పై సంవత్సరాలుగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని, ఇప్పుడు, ఏ ప్రాతిపదికన దానిని 22 శాతానికి కుదించారో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా విడుదల చేసిన రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఏ ప్రాతిపదికన విడుదల చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఐదేళ్లలో ఎలాంటి గణాంక వివరాలు లేకుండా ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామన్న కేసీఆర్ తన మాట మార్చారని విమర్శించారు. బీసీలకు బర్రెలు, గొర్రెలు ఇవ్వడమే తప్ప, చట్టసభల్లో అవకాశం కల్పించేది లేదా? అని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తూ విడుదల చేసిన ఆర్డినెన్స్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.