TV: ఆందోళన వద్దు.. టీవీ ప్రసారాలు ఆగిపోవు: స్పష్టం చేసిన ట్రాయ్
- టీవీ ప్రసారాలు ఆగిపోనున్నాయంటూ వార్తలు
- చానళ్ల ప్రసారాలు యథావిధిగా కొనసాగుతాయన్న ట్రాయ్
- తగిన చర్యలు తీసుకోవాలంటూ కేబుల్ ఆపరేటర్లకు ఆదేశాలు
ఈ నెల 29 తర్వాత టీవీ ప్రసారాలు ఆగిపోతాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) తెలిపింది. కొత్త నియంత్రణ విధానాల అమలు నేపథ్యంలో ఇప్పటికే చందా చెల్లించిన చానళ్ల ప్రసారం కూడా నిలిచిపోతుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం వినియోగదారులు వీక్షిస్తున్న ఏ చానల్ ప్రసారం కూడా 29వ తేదీ తర్వాత ఆగిపోదని పేర్కొంది. ఈ మేరకు ప్రసార సంస్థలు, పంపిణీ ఆపరేటర్లు, స్థానిక కేబుల్ ఆపరేటర్లు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది.
మార్చి 2017లో ప్రసార, కేబుల్ సేవలకు సంబంధించి ట్రాయ్ సరికొత్త నియంత్రణ విధివిధానాలను జారీ చేసింది. జూలై 3, 2018లో వీటిని తిరిగి జారీ చేస్తూ అమలు షెడ్యూలును నిర్దేశించింది. అయితే, వివిధ టీవీల్లో వస్తున్న ప్రకటనల్లో స్పష్టత లేకపోవడంతో ఈ నెల 29 నుంచి చందా చెల్లించని చానళ్ల ప్రసారాలు నిలిచిపోతాయన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో స్పందించిన ట్రాయ్ ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. కొత్త విధివిధానాల అమలు కారణంగా టీవీ సేవల్లో ఎటువంటి అంతరాయం ఉండదని పునరుద్ఘాటించింది.