Amritsar: ప్రధాని గారూ.. బుల్లెట్ రైలును మర్చిపోండి.. ఉన్నవాటిపై దృష్టి పెట్టండి: బీజేపీ నేత
- మోదీ చెబుతున్న ‘అచ్చేదిన్’ ఎక్కడ?
- రైలులో ఏ ఒక్కటీ బాగాలేదు
- హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్ చేస్తే స్పందన కరవు
బుల్లెట్ రైలు విషయాన్ని పక్కనపెట్టి ఉన్న రైళ్ల సంగతి చూడాలని బీజేపీ సీనియర్ నేత, పంజాబ్ మాజీ మంత్రి లక్ష్మీకాంత చావ్లా ప్రధాని నరేంద్రమోదీ, రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌లకు సూచించారు. సరయు-యమున ఎక్స్‌ప్రెస్ రైలులో అమృత్సర్ నుంచి అయోధ్య ప్రయాణించిన ఆమె అనంతరం మాట్లాడుతూ ఓ వీడియోను విడుదల చేశారు. రైలులో ‘‘అచ్చే దిన్’’ ఎక్కడున్నాయని ప్రశ్నించిన చావ్లా.. సరయు-యమున ఎక్స్‌ప్రెస్ రైలు డోర్లు బాగాలేవని, బాత్రూములో నల్లాలు పనిచేయడం లేదని, టాయిలెట్ సీట్లు పగిలిపోయాయని పేర్కొన్నారు. తాను ఎక్కిన రైలు తొమ్మిది గంటలు ఆలస్యంగా నడిచినట్టు పేర్కొన్నారు.
ఏసీ 3 టయర్ కోచ్‌లో ప్రయాణించిన చావ్లా.. రైలులో నీళ్లు లేవని, ఆహార సరఫరా సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైలు అన్ని గంటలు ఎందుకు ఆలస్యమైందో తెలుసుకుందామని ప్రయత్నిస్తే ఒక్కరు కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైలును దారి మళ్లించినట్టు ఆ తర్వాత తనకు తెలిసిందన్నారు. రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే స్పందన లేదని, రైల్వే మంత్రికి ఈమెయిల్స్ పంపినా స్పందన లేకుండా పోయిందని అన్నారు. రైల్వే వ్యవస్థ మొత్తం తప్పుడు సమాచారంతో నడుస్తోందని దుమ్మెత్తి పోశారు.