congress: 15 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. 24 గంటల్లో కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది: రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఉమేష్ కత్తి
- 15 మంది ఎమ్మెల్యేల కోసం బీజేపీ తలుపులు తెరిచే ఉన్నాయి
- 15 రోజుల వ్యవధిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది
- బీజేపీలో చేరనున్నట్టు ఇప్పటికే హింట్ ఇచ్చిన రమేష్ జర్కిహోళి
కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోబోతోందని ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఉమేష్ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని... వారికోసం బీజేపీ తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పారు.
8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉమేష్ మాట్లాడుతూ, కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 24 గంటల్లో కూలిపోనుందని అన్నారు. కర్ణాటకలో 15 రోజుల వ్యవధిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలిపారు. కేబినెట్ నుంచి తొలగింపబడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ జర్కిహోళి... తాను పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నట్టు ఇప్పటికే హింట్ ఇచ్చారు.
మరోవైపు ఉమేష్ కత్తి వ్యాఖ్యలపై కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉమేష్ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం కూలిపోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అంటూ ఉమేష్ కత్తికి సవాల్ విసిరారు.