Triple Talaq: కట్నం కూడా పరస్పర అంగీకారంతో ఇచ్చిపుచ్చుకునేదేగా?: స్మృతీ ఇరానీ
- ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించిన లోక్సభ
- ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి ఘాటు కౌంటర్
- ట్రిపుల్ తలాక్ ముమ్మాటికీ నేరమే
ప్రతిపక్షాల నిరసనల మధ్య గురువారం ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్సభ ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 245 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లు ఆమోదం పొందినట్టు అయింది. ఇప్పుడు దీనిని రాజ్యసభకు పంపనున్నారు. అక్కడ కూడా బిల్లుకు ఆమోదం లభిస్తే చట్టంగా మారుతుంది. లోక్సభలో ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విడాకులిచ్చే పురుషుడిని నేరస్తుడని ఏ మతమూ చెప్పలేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. కేంద్రం వైఖరికి నిరసనగా కాంగ్రెస్, అన్నా డీఎంకే పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం బిల్లుపై ఓటింగ్ జరిపి ఆమోదించారు.
ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రతిపక్షాలు విమర్శించడంపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి చట్టాలు తేవడంలో విఫలమైందని ఆరోపించారు. పెళ్లిళ్ల సమయంలో కట్నం ఇవ్వడం ఆచారమని, ఇది రెండు కుటుంబాల మధ్య పరస్పర అంగీకారంతో జరుగుతుందని పేర్కొన్నారు. రెండు వర్గాల మధ్య పరస్పర అంగీకారంతో ఇది జరిగినప్పటికీ కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని చట్టం చెబుతుందని పేర్కొన్నారు. కాబట్టి తక్షణ ట్రిపుల్ తలాక్ వ్యవహారాన్ని కూడా ‘ఖలీఫా’గానే చూడాలని స్పష్టం చేశారు. చట్టపరంగా ట్రిపుల్ తలాక్ చెప్పడం ముమ్మాటికీ తప్పేనని మంత్రి తేల్చిచెప్పారు.