jagan: రాయలసీమ ద్రోహిగా జగన్ మిగిలిపోతారు: యనమల
- కడపలో పరిశ్రమలు రావడం జగన్ కు ఇష్టం లేదు
- రాష్ట్ర ప్రగతికి ప్రతిపక్షమే పెద్ద అడ్డంకి
- జగన్ ది అర్థం లేని పాదయాత్ర
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ ఆర్థిక మంత్రి యనమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ద్రోహిగా జగన్ మిగిలిపోతారని ఆయన విమర్శించారు. కడపలో పరిశ్రమలు రావడం జగన్ కు ఇష్టం లేదని అన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూములను కేటాయించడం, జగన్ కమిషన్లను దండుకోవడం అందరికీ తెలిసిందేనని చెప్పారు. రాష్ట్ర ప్రగతికి ప్రతిపక్షమే పెద్ద అడ్డంకి అని... ఇలాంటి ప్రతిపక్షాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే చూడలేదని విమర్శించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమలో వైసీపీ చిత్తుగా ఓడిపోనుందని యనమల జోస్యం చెప్పారు. జగన్ పాదయాత్ర చాలా గొప్పగా సాగుతోందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటుండటం హాస్యాస్పదంగా ఉందని... పాదయాత్రకు ప్రజాస్పందన ఏమాత్రం లేదని ఎద్దేవా చేశారు. జగన్ ది అర్థం లేని పాదయాత్రని... ఒక్క పక్కా హామీని కూడా ఇవ్వలేక పోయారని, ఏ ఒక్క సమస్యపై ఏ జిల్లా కలెక్టర్ కు లేఖ రాసిన పాపాన పోలేదని విమర్శించారు. ప్రజల కోసం చంద్రబాబు పాదయాత్ర చేస్తే... కేసుల మాఫీ కోసం జగన్ పాదయాత్ర చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.