singapore: సింగపూర్ లో నారా లోకేశ్ మూడో రోజు పర్యటన.. పలువురితో భేటీ
- ప్రభుత్వ సేవలు డిజిటలైజ్ చేస్తున్న విషయాన్ని చెప్పా
- రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నా
- ఏపీలో అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించా
సింగపూర్ లో నారా లోకేశ్ మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. సింగపూర్ లో తాను ఏఏ కార్యక్రమాల్లో పాల్గొన్నదీ లోకేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. సింగపూర్ స్మార్ట్ నేషన్ అండ్ డిజిటల్ గవర్నమెంట్, డిప్యూటీ సెక్రటరీ టాన్ కాక్ యామ్ తో సమావేశమయ్యానని, ప్రజల జీవనశైలిలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ‘మూమెంట్స్ ఆఫ్ లైఫ్’ పేరుతో పుట్టుక నుండి మరణం వరకూ అనేక ప్రభుత్వ సేవలు డిజిటలైజ్ చేస్తున్నామని ఆయనకు వివరించినట్టు చెప్పారు.
ఏపీలో సింగల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఏర్పాటు చేయడానికి ఈ-ప్రగతి ఏర్పాటు చేశామని, అనేక ప్రభుత్వ సర్వీసులు ఆన్ లైన్ ద్వారా అందిస్తున్న విషయాన్ని తెలియజేశానని, ప్రజలకు టెక్నాలజీ వినియోగంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు సహకారం కావాలని కోరినట్టు తెలిపారు.
సెంటోసా డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఫ్రీడితో సమావేశమయ్యానని, సెంటోసా ఐల్యాండ్ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యల గురించి ఆయన వివరించగా ఏపీలో ఉన్న దీవులను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి సహకరించాలని కోరానని లోకేశ్ పేర్కొన్నారు.
ఏపీలో అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించా
నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఆధ్వర్యంలో ఇని స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలకు, ఐఎస్ఏఎస్ సభ్యులకు వివరించిన విషయాన్ని ప్రస్తావించారు. తాగునీటి నాణ్యత తెలుసుకోవడానికి సెన్సర్లను, రోడ్ల పరిస్థితిని తెలుసుకోవడానికి డ్రోన్లను వినియోగిస్తున్నామని వివరించానని, డేటా అనలిటిక్స్, టెక్నాలజీ వినియోగం ద్వారా 18 శాతం తక్కువ వర్ష పాతం ఉన్నా, వ్యవసాయంలో 24 శాతం వృద్ధి సాధించిన విషయాన్ని వారి దృష్టికి తెచ్చానని తెలిపారు. ఏపీలో ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజ్ చెయ్యడంతో పాటు బ్లాక్ చైన్ టెక్నాలజీతో రక్షణ కల్పిస్తున్నామని, నాల్గవ పారిశ్రామిక విప్లవం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సమావేశంలో వివరించినట్టు లోకేశ్ తన వరుస ట్వీట్ల ద్వారా వివరించాను.