manmohan singh: మన్మోహన్ సింగ్ పాత్రలో నటించడం ఓ సవాల్ అనిపించింది!: అనుపమ్ ఖేర్
- ఈ సినిమాలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచా
- మా అమ్మ కూడా నన్ను గుర్తుపట్టలేదు
- నేను ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవ్వాల్సిందే
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'. ఈ చిత్రం ట్రైలర్ పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ విషయమై కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్ పాత్రను బీజేపీ నేత, ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించారు. కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో అనుపమ్ ఖేర్ ని మీడియా పలకరించింది.
మన దేశంలో నటన కన్నా నిరసనలకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టుగా కన్పిస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఈ చిత్రం గురించి ప్రస్తావిస్తూ, ఐదు వందలకు పైగా సినిమాల్లో నటించిన తనకు, మన్మోహన్ సింగ్ పాత్రను పోషించడం ఓ సవాల్ అనిపించిందని, అయినప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచానని చెప్పారు. మన్మోహన్ పాత్రలో జీవించానని, తన తల్లి కూడా తనను గుర్తుపట్టలేనంతగా ఆ పాత్రలో ఒదిగిపోయానని అన్నారు. కచ్చితంగా, ఆస్కార్ అవార్డుకు తాను నామినేట్ అవ్వాల్సిందేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు, బెదిరింపులు తనను నిరాశకు గురిచేస్తున్నాయని అనుపమ్ ఖేర్ ఆవేదన వ్యక్తం చేశారు.