Hyderabad: ఇంటర్నెట్ సెంటర్‌తో నష్టాలు.. ఈజీ మనీ కోసం దినేశ్ పెడదారి!
- ఇంట్లోనే వీవోఐపీ ఎక్స్చేంజ్ ప్రారంభం
- విదేశాలకు చవగ్గా కాల్స్ చేసుకునే అవకాశం
- దినేశ్‌ను సంప్రదించిన పాక్ ఉగ్రవాదులు
ఐసిస్ ఉగ్రవాదులతో రహస్య సంభాషణలు చేస్తూ భారత సైన్యం కదలికలను తెలుసుకునేలా వారికి సాయం చేస్తున్న హైదరాబాద్‌లోని నల్లకుంట వాసి దినేశ్‌ను శుక్రవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లోనే ఓ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసుకుని మరీ ఈ దందా సాగిస్తున్న దినేశ్ అరెస్ట్‌తో ఒక్కసారిగా కలకలం చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వ్యాపారంలో నష్టాలు అతడిని ఈజీ మనీ కోసం పాకులాడేలా చేశాయి.
మూడేళ్ల క్రితం దినేశ్ ఓ ఇంటర్నెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అయితే, నష్టాలు రావడంతో దానిని మూసేశాడు. ఈజీ మనీ కోసం పాకులాడిన దినేశ్ ఏడు నెలల క్రితం తన ఇంట్లోనే ఓ వీవోఐపీ ఎక్స్చేంజ్ (దీని ద్వారా మన నంబరు తెలియకుండానే విదేశాలకు ఫోన్ చేయవచ్చు) ఏర్పాటు చేశాడు. దుబాయ్ సహా వివిధ దేశాలకు అతి తక్కువ ధరలో ఫోన్లు చేసుకోవచ్చంటూ ప్రచారం చేశాడు. దీంతో గిరాకీ బాగానే పెరిగింది.
నెంబరు గోప్యంగా ఉంటూనే విదేశాలకు కాల్ చేసే సౌకర్యం కల్పిస్తున్న దినేశ్‌ను ఐదు నెలల క్రితం ఐఎస్ఐ ఏజెంట్లు సంప్రదించారు. వీరి మధ్య డీల్ కుదరడంతో అప్పటి నుంచి దినేశ్ వీవోఐపీ ఎక్స్చేంజ్ నుంచి వారు పాకిస్థాన్ ఉగ్రవాదులతోను, కశ్మీర్‌లోని సైనికాధికారులతోనూ తరచూ మాట్లాడుతూ రహస్య సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. సైన్యంలోని ఉన్నతాధికారుల పేరుతో ఫోన్లు చేస్తూ సైనికాధికారుల సమాచారం అడుగుతుండడంతో అనుమానం వచ్చిన వారు నిఘా విభాగానికి సమాచారం అందించడంతో విషయం బయటపడింది. దినేశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, పదుల సంఖ్యలో సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు.