Kumaraswamy: ‘యాక్సిడెంటల్ సీఎం’లో కుమారస్వామి పాత్రను ఎవరు పోషిస్తారు?: బీజేపీ సెటైర్లు
- న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం సింగపూర్‌కు కుమారస్వామి కుటుంబం
- తిరిగి 1న రాష్ట్రానికి రాక
- రాష్ట్రం అప్పుల్లో ఉంటే సీఎం విదేశాల్లో షికారు చేస్తున్నారన్న బీజేపీ
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామిపై బీజేపీ మరోమారు తీవ్ర విమర్శలు చేసింది. సీఎంను ‘యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్’గా అభివర్ణించిన బీజేపీ.. ఒకవేళ ఆ పేరుతో సినిమా తీస్తే కుమారస్వామి పాత్రలో ఎవరు నటిస్తారన్న గొప్ప సందేహాన్ని వెలిబుచ్చింది. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంటే ముఖ్యమంత్రి మాత్రం కొత్త సంవత్సరాన్ని సింగపూర్‌లో జరుపుకుంటున్నారని విరుచుకుపడింది.
నూతన సంవత్సరాన్ని విదేశాల్లో జరుపుకోవడం కుమారస్వామికి అలవాటు. గత కొన్నేళ్లుగా ఆయన అలానే చేస్తున్నారు. ఇందులో భాగంగా కుటుంబంతో కలిసి 29న రాత్రి సింగపూర్ బయలుదేరారు. జనవరి 1న తిరిగి కర్ణాటక చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ తన ట్వీట్‌తో ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించింది.
‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్‌ను రూపొందించిన నేపథ్యంలో కుమారస్వామిని ‘యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్’గా బీజేపీ అభివర్ణించింది. ఇటీవల విడుదలైన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమా ట్రైలర్ దేశ రాజకీయాల్లో దుమారం రేపింది. ఈ సినిమాపై కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. మన్మోహన్ సింగ్‌ను కించపరిచేలా సినిమాను చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు.