suicide: ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య... మానసిక సమస్యల వల్లేనని అనుమానం
- గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని బలవన్మరణం
- ‘నావల్ల అందరికీ ఇబ్బందులే’ అంటూ సూసైడ్ నోట్
- మృతుడు చిత్తూరు జిల్లా వాసి
నాగార్జునసాగర్ కుడి జలవిద్యుత్ కేంద్రం పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ లక్ష్మీపతి (28) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా శనివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... లక్ష్మీపతి తిరుమలలో విధులు నిర్వహించి నాలుగేళ్ల క్రితం బదిలీపై గుంటూరు జిల్లాలోని విద్యుత్ కేంద్రం పరిధిలోకి వచ్చారు. సమీపంలోని ఏపీ జెన్కో క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని తన గదికి వెళ్లాడు. లక్ష్మీపతితోపాటు మరో ఇద్దరు అదే గదిలో ఉంటున్నారు.
ఘటన జరిగిన రోజు రాత్రి రూంమేట్ రాజీవ్ క్రిస్మస్ పండుగకు సొంతూరుకు వెళ్లాడు. మరో రూంమేట్ వెంకటేష్ విధుల్లోకి వెళ్లాడు. ఇతను శనివారం ఉదయం ఎ షిఫ్ట్ ముగించుకుని భోజనం కోసం రూం వద్దకు వచ్చాడు. తలుపు కొట్టినా ఎంతసేపటికీ తీయకపోవడంతో ఎదురు గదిలో ఉన్న సహచర సిబ్బందికి సమాచారం తెలిపాడు. లక్ష్మీపతి పోటీ పరీక్షలకు ప్రిపేరవుతుండడంతో చదువుతూ నిద్రపోయి ఉంటాడని అంతా అనుకున్నారు. ముఖంపై నీళ్లు చల్లుదామని నిచ్చెన వేసుకుని కిటికీలోనుంచి చూడగా లక్ష్మీపతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వచ్చి గది తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. సన్నని వైరుతో లక్ష్మీపతి ఉరివేసుకున్నట్లు గుర్తించారు. అతను రాసిన సూసైడ్ నోట్ పక్కన పడివుండడంతో స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘నా నుంచి అందరికీ ఇబ్బందులే...అందుకే ఈ పనిచేస్తున్నా’ అని రాసివుంది. లక్ష్మీపతి బ్యాగులో మానసిక వైద్యుని వద్ద చికిత్స పొందిన ప్రిస్కిప్షన్ లభించింది. దీంతో మానసిక సమస్యల కారణంగానే లక్ష్మీపతి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. చిత్తూరు జిల్లా యడమర్రి మండలం తాట్రపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీపతికి ఇంకా పెళ్లి కాలేదు. తల్లి, ఇద్దరు సోదరులు ఉన్నారు.