kcr: నాకేదో భాష రానట్టు.. కేసీఆర్ ‘ఆక్స్ ఫర్డ్’ లో చదువుకున్నట్టు మాట్లాడుతున్నాడు: సీఎం చంద్రబాబు
- ‘నాతో ‘జై తెలంగాణ’ అని కేసీఆర్ అనిపించారట
- ఆయన అనిపించడమేంటి?
- తెలంగాణతో నేనెప్పుడు విభేదించాను?
తనకేమో భాష రానట్టు.. కేసీఆర్ కు ఏదో బాగా వచ్చన్నట్టు, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకుని వచ్చినట్టు మాట్లాడుతున్నాడని సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నాతో ‘జై తెలంగాణ’ అనిపించానని అంటున్నాడు. ఆయన అనిపించడమేంటి? తెలంగాణతో నేనెప్పుడు విభేదించాను?
ఆ రోజున రాష్ట్రం కోసం సంపద సృష్టించాను. విభజన కారణంగా ఆ సంపద ఇంకో రాష్ట్రానికి పోయినప్పుడు చాలా మంది నన్ను ‘మీకు బాధగా ఉందా?’ అని అడిగారు. నేను చెప్పాను, ‘నా కెప్పుడూ బాధ లేదు. తెలుగు జాతి కోసం సంపద సృష్టించాను.. ఎంజాయ్ చేస్తారు. భగవంతుడు నాకు శక్తిని ఇచ్చాడు. హైదరాబాద్ కు ఈక్వల్ గా అభివృద్ధి చేస్తాను’ అని చెప్పాను.
నరేంద్ర మోదీ పన్నెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ముఖ్యమంత్రిగా ఏం చేశారు? ఏమీ చేయలేదు. అహ్మదాబాద్ లో ఏముంది? ఒక్క ఐటీని ప్రమోట్ చేయలేక పోయారు. నాలెడ్జి ఎకానమీ ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో ఒక్క నాలుగేళ్లలోనే ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతోంది. హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్,ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. వీళ్లు నన్ను ఇబ్బంది పెట్టి ఎట్టి పరిస్థితిలో అమరావతి రాకుండా ఉండాలని ప్రయత్నం చేశారు. ఈరోజున వారు డబ్బులు ఇవ్వకపోయినా అమరావతి రియాల్టీ అవుతుంది. వాళ్లకు అసూయ. ప్రధానమంత్రి మన మీద చాలా కక్ష గట్టారు’ అని బాబు విమర్శించారు.